|
అక్షయ తృతీయ - పసిడి పండుగ
అక్షయం అంటే క్షయం లేకుండుట. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో
శుక్ల పక్ష తదియనాడు జరుపుకోవడం ఆచారం. ఈ పండుగను గురించి, ఆరోజు ఆచరించాల్సిన విధి విధానాలను భవిష్య, శివపురాణాల్లో వివరించారు.
"వైశాఖ మానస్య చయా తృతీయా
న నమ్యసౌ కార్తీక శుక్ల పక్షే
నభస్య మానస్య తమ్రిన పక్షే
త్రయోదశీ పంచదశీ చమాఘే"
అని పురాణాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించారు. వైశాఖ శుద్ద తృతీయ రోజు కృతయుగం. కార్తీక శుక్ల నవమి రోజు త్రేతాయుగం, భాద్రపద బహుళ త్రయోదశీనాడు ద్వాపర యుగం,
మాఘ బహుళ అమావాస్య నాడు కలియుగం ప్రారంభమైందని విష్ణుపురాణం చెబుతోంది. కృతయుగం ప్రారంభమైన రోజు కృత ఉగాది. ఈ కృతయుగాది పర్వదినాన్నే అక్షయ తృతీయగా జరుపుకుంటున్నారు.
ఈ రోజు ఉదయమే లేచి స్నానం చేసి నీటి కుండను, గ్రీష్మ రుతువులో పండే అన్ని రకాల పంటలను అంటే యవలు, గోధుమలు, సెనగలు, తదితరాలు, దద్యోదనాన్ని దానం చేయాలని, ఆలా చేసినవాడు శాశ్వతంగా కైలాసంలో నివాసం ఉంటాడని భవిష్యపురాణం, దేవి పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున పితృదేవతలకు పిండ రహితమైన శ్రాద్దాన్ని చేస్తారు.
కొన్ని ప్రాంతాల్లొ గౌరిదేవికి, శ్రీ కృష్ణునికి డోలోత్సవాలు జరుపుతారు. ముత్తయిదువులు, కన్యలు ఈ పూజల్లో పాల్గొంటారు. పూజ తరువాత పండ్లు, మిఠాయిలు నానబెట్టిన సెనగలు వాయనం ఇస్తారు. వ్రతం చేయాలనుకునే వారు, ఈ రోజున ఉప్పును మానేసి, చక్కెర కలిపిన పేలపిండిని
తింటారు. బదరి నారాయణ స్వామి ఆలయాన్ని ఈ పర్వదినాన్నే తెరుస్తారు.
ఈ రోజున గొడుగులు, చెప్పులు, గోవు, భూమి, కాంచనం, వస్త్రాలు, నీరు నిండిన కుండను దానం చేయటం మహాపుణ్యం. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెబుతాడు.
ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు
చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.
|