More
More Videos Advt...

25,000 మందిని మింగిన మయన్మార్‌ పెనుతుపాను

మయన్మార్‌ పెనుతుపాను చరిత్రలో ఎన్నడూ లేనంతటి విషాదాన్ని మిగిల్చింది. తొలుత అనుకున్నట్టు వందలు కాదు, వేల ల్లో ప్రజలు అకాల మృత్యువాత పడ్డారు. తాజా పరిస్థితిని బట్టి మృతుల సంఖ్య 25,000 పైనే అని భావిస్తున్నారు. కనీసం రెండు లక్షల మంది మయన్మార్‌ ప్రజలు నిరాశ్రయులయ్యారు. భవనాలు కుప్పకూలిపోయాయి. పంటలు సర్వనాశనమైపోయాయి.

అయితే ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో సైతం మయన్మార్‌ సైనిక ప్రభుత్వం సకాలంలో స్పందించి బయటనుంచి వచ్చే సాయాన్ని స్వీకరించడానికి తాత్సారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు మయన్మార్‌ ప్రజలకు చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తుండగా, వీరికి వీసా మంజూరులో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి.

మయన్మార్‌ సైనిక ప్రభుత్వం ప్రస్తుతం ఎవరినీ విశ్వసించే పరిస్థితుల్లో లేదు. ఏ స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో ఎవరు దేశంలోకి ప్రవేశించి దేశ సుస్థిరతను దెబ్బ తీసేస్తారోనన్న బెంగతో మయన్మార్‌ ప్రభుత్వం సాచివేతతో కాలయాపన చేస్తున్నది.

తుపాను తాకిడికి మృతి చెందిన వారికి కనీస అంతిమ సంస్కారం చేసే పరిస్థితులు కూడా అక్కడ లేవు. ఎలాగో బ్రతికి బయటపడిన వారికి ఎటు పోవాలో దిక్కుతోచడంలేదు. సకాలంలో సాయం అందక, ఉండడానికి ఇల్లు లేక, అయిన వారు గాలికి కొట్టుకుపోగా తుపాను బాధితులు వర్ణించనలవికాని సంక్షోభంలో ఉన్నారు.